tgindex

Devotional Telugu

описание

An attempt to bring our Hindu Devotional information

3 474
подписчиков
Охват к подписчикам
54,3%
ERR
Реакции к просмотрам
0,00%
0 на 20 постов
Пересылки к просмотрам
0,31%
115
Постов в день
0,0
всего 20

Где отзываются чаще

доля реакций к просмотрам
  • 8 авг.బంగారు లోకం ఆధునిక కాలంలో మనిషి జీవితం సంకుచితమైపోతోంది. అందుకు కారణం ఏదైనప్పటికీ మనిషి అశాంతితో, అసంతృప్తితో జీవిస్తున్నాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. దీనికి పరిష్కారం లేదా? అంటే ఉందనే చెబుతున్నారు అనుభవజ్ఞులు. ఒకే పరిసరాలు, ఒకేలాంటి జీవితం, ఏమాత్రం మార్పులేని జీవన స్థితిగతులు.. ఈ నేపథ్యంలోనూ మనిషి తనదైన బంగారు లోకాన్ని సృష్టించుకునే అవకాశం ఉందనే అంటున్నారు. మానవ జీవితానికి సంబంధించి సమాజం బయటి లోకమైతే, అంతరంగంలో ఉండే మరొక ప్రపంచం... మనసు! బయటి లోకాన్ని మనం మార్చలేకపోవచ్చు కానీ, లోపలి ప్రపంచాన్ని తప్పకుండా మార్చుకోగలుగుతాం! మనిషికి విసుగు కలగడానికి ప్రధాన కారణం- గానుగెద్దులాంటి బతుకు. బాహ్య జీవితంలో మనిషి వృత్తి వ్యవహారాల్లో లీనమై ఉంటాడు. చాలా సందర్భాల్లో అది సంఘర్షణాత్మకంగా ఉండవచ్చు. ఆ కారణంగా నిత్యం విసుగ్గా బతుకుతుంటే జీవితానికి అన్యాయం చేస్తున్నట్లే. ఆంతరంగిక జీవితం విషయానికొస్తే- మనసు చేయి తిరిగిన చిత్రకారిణి. అవసరమైన రంగులన్నీ ఆత్మ అనే పళ్లెంలోనే ఉంటాయి. అలా మనదైన జీవితమనే వర్ణ చిత్రం రూపుదిద్దుకుంటుంది. పుస్తకం చదువుతాం. ఏదో అర్థమవుతుంది. ఇంకోసారి చదివితే కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. అలాగే రోజూ చూసే పచ్చని చెట్టే రోజుకో కొత్త ఛాయలో అలరిస్తుంది. ప్రేమ, ఆప్యాయతల రంగరింపుతో బాంధవ్యాలూ నిత్యనూతనంగా ఉంటాయి. అంతర దృష్టిని సాధన చేసినప్పుడు జీవితం ఎప్పుడూ కొత్తగా, మధురంగానే భాసిస్తుంది. ధ్యానంతో లోలోపలి దివ్యలోకాలను సైతం దర్శించవచ్చునన్నది సత్యం. కొద్ది నిమిషాలపాటు ధ్యానంలో కూర్చుని శ్వాసను గమనిస్తూ ఉంటే మధుర ఓంకారనాదం మనసులో ప్రతిధ్వనిస్తుంది. ధ్యానజ్యోతిలోని వెలుగును సాధకుడు వీక్షించగలిగినప్పుడు అతడి హృదయం దివ్యశోభతో ప్రకాశమానమవుతుంది. సృష్టి... మొదట లోపల ప్రభవిస్తుంది. తర్వాత బయట సాక్షాత్కారమవుతుంది. మనిషికి స్వభావసిద్ధంగా కృతజ్ఞత, భక్తి, ప్రేమ, దయ అనే సుగుణాలుంటాయి. వాటి విలువలను జీవితంలో పొందుపరుచుకుంటూ కొత్త ఆనందాలను పొందే ప్రయత్నం చేయవచ్చు. నిజానికి జీవితం చాలా చిన్నది. కానీ అనుభవాలు గొప్పవి. శాంతి ఉన్న హృదయంలోనే ఆత్మానందం పెల్లుబుకుతుందని సాధకుడు గ్రహించాలి. రావి మొక్క ఎక్కడపడితే అక్కడ మొలుస్తుంది. మొండి గోడల మీద, ఇళ్ల పైకప్పుల మీద! అక్కడే ఎదిగి విస్తరించే ప్రయత్నం చేస్తుంది! ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా రావిలా మొలిచి జీవిస్తూ ఒదిగి విస్తరించే ప్రయత్నం చేయగల మనిషి ధన్యుడు. బంగారు లోకం మనిషి చేరుకోలేనంత దూరంలో, అతనికి అందనంత ఎత్తులో లేదు. అది మన చేరువలో... ధ్యానంలో, భక్తిలో ఉందని గ్రహించాలి! జీవితం పాతదే అయినా జీవన గతిని మార్చుకున్నప్పుడు ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. బంగారు లోకం చెంతకొస్తుంది. అలాంటి నిత్య నూతన బంగారు జీవనాన్ని ఆస్వాదించేందుకు మనిషి సదా సన్నద్ధుడై ఉండాలి. గోపాలుని రఘుపతి రావు0,00%
  • 20 июл.అంతర్గత యజ్ఞం మనలో చాలామందికి ఏదో ఒక రంగంలో సహజమైన ప్రతిభ ఉంటుంది. అయితే ఆ ప్రతిభను నైపుణ్యంగా, దక్షతగా, చివరికి అసాధారణ సామర్థ్యంగా మార్చేది మాత్రం క్రమశిక్షణే. ముడి బంగారం దానంతటదే ఆభరణం కాలేదు; దానికి అగ్ని సంస్కారం అవసరం. అలాగే క్రమశిక్షణ అనే తపోగ్నిలో ప్రతిభ అనే బంగారం మెరుగులు దిద్దుకుని సామర్థ్యంగా ప్రకాశిస్తుంది. పరమాత్ముడు ప్రతిభను వరంలా ప్రసాదించవచ్చు. కానీ దాన్ని పరిమళభరితమైన దివ్యకుసుమంలా వికసింపజేసేది మన అంతర్గత క్రమశిక్షణే. తపస్సు లేకుండా సిద్ధి లేదు. అభ్యాసం లేకుండా ప్రావీణ్యం లేదు. నియమం లేకుండా జ్ఞానం నిలవదు. మనకు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ- ఇంద్రియనిగ్రహం, నిరంతర సాధన లేకపోతే ఆ ప్రతిభ ఫలించదు. అర్జునుడు సహజ ప్రతిభావంతుడే. కానీ అతణ్ని సాటిలేని విలుకాడిగా నిలబెట్టింది నిరంతర సాధన. ఒకసారి రాత్రివేళ భోజనం చేస్తుండగా, వెలుతురు లేకపోయినా చేయి సహజంగా నోటి దగ్గరికి చేరుతున్నదని గమనించాడు. ఆ క్షణమే ‘అభ్యాసం వల్ల చీకటిలోనూ లక్ష్యాన్ని ఛేదించవచ్చు’ అనే ఆలోచన అతడిలో మెదిలింది. అప్పటి నుంచి రాత్రివేళల్లోనూ సాధన కొనసాగించాడు. నిద్రను జయించి ‘గుడాకేశుడు’గా పేరుపొందాడు. కఠోర సాధనతో శబ్దభేది విద్యలో అఖండ ప్రజ్ఞను సంపాదించాడు. క్రమశిక్షణే అతణ్ని ‘సవ్యసాచి’గా, అసమాన ధనుర్విద్యా విశారదుడిగా తీర్చిదిద్దింది. ఒక లక్ష్యాన్ని తీసుకుని దానిపైనే మనసును కేంద్రీకరించడం క్రమశిక్షణ లేకుంటే సాధ్యం కాదు. ప్రతిభ కలిగి ఉండటం గొప్ప విషయమే. కానీ సాధారణ పనులను అసాధారణ నిబద్ధతతో చేయడం అంతకన్నా గొప్పది. వాస్తవానికి ప్రతిభ లేకపోవడం కన్నా క్రమశిక్షణ లేకపోవడమే పెద్ద సమస్య. విజయవంతమైన వ్యక్తుల జీవితాల్లో మనం చూసేది వారి గెలుపునే కానీ ఆ విజయానికి మూలమైన క్రమశిక్షణను తరచూ గమనించం! ప్రతిభ మనల్ని వేదికపైకి తీసుకురాగలదు. కానీ ఆ వేదికపై స్థిరంగా ఉంచి మన గౌరవాన్ని నిలబెట్టేది క్రమశిక్షణే. చంచలమైన మనసును అదుపుచేసి, సహజ ప్రతిభను దక్షతగా మార్చేవి... అభ్యాసం, వైరాగ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా- ‘అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే.’ క్రమశిక్షణతో జీవించడం మొదట్లో కష్టంగానే అనిపిస్తుంది. కొన్ని ఇష్టాలను వదులుకోవాలి. నిరంతరం శ్రమించాలి. క్రమశిక్షణ వల్ల కలిగే తాత్కాలిక అసౌకర్యమా? లేక దాన్ని విస్మరించడం వల్ల జీవితాంతం వెంటాడే పశ్చాత్తాపమా? ఈ రెంటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలన్నది మన వివేకంపై ఆధారపడి ఉంటుంది. క్రమశిక్షణ మనల్ని బంధించే శిక్ష కాదు. మనలోని బద్ధకం, వాయిదా వేసే స్వభావం, పరధ్యానం, అనాలోచిత అలవాట్లను దహనం చేసి- మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా శుద్ధి చేస్తూ లక్ష్యసాధన వైపు నడిపించే అంతర్గత యజ్ఞం. ప్రతిభను తిరుగులేని సామర్థ్యంగా, సామర్థ్యాన్ని సాఫల్యంగా మార్చే శక్తి క్రమశిక్షణ సొంతం. గుమ్మడి రవీంద్రనాథ్0,00%
  • 18 июл.నీలోకి నువ్వు మనిషి జీవితమంతా ఒక వెతుకులాట. చిన్నప్పుడు ఆనందం కోసం, యవ్వనంలో విజయం వెనకాల పరుగెడతాడు. వయసు పెరిగేకొద్దీ ప్రశాంతత కోసం అన్వేషిస్తాడు. అయితే తాను వెతుకుతున్నది బయట దొరకదని ఆలస్యంగా గ్రహిస్తాడు. జీవితం మనకెన్నో గుర్తింపులను ఇస్తుంది. పేరు, కుటుంబం, వృత్తి, సంబంధాలు, హోదా... ఒక్కోటి మన చుట్టూ ఒక కొత్త పొరను నిర్మిస్తుంది. కాలక్రమంలో ఆ పొరలనే తన అసలు స్వరూపంగా భావించడం ప్రారంభిస్తాడు. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగులుతుంది. నేనెవరు? ఈ ప్రశ్నకు సమాధానం పుస్తకాల్లోనో, ప్రవచనాల్లోనో దొరకదు. ఎందుకంటే ఇది తెలుసుకోవాల్సిన సమాచారం కాదు; అనుభవించాల్సిన సత్యం. అందుకే మౌనం అవసరం. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమే కాదు, మనసులో నిరంతరం ప్రవహించే ఆలోచనలకు కాసేపు విశ్రాంతి ఇవ్వడం. గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు, నెరవేరని కోరికలు, చెప్పుకోని బాధలు మనలో అలజడిని సృష్టిస్తాయి. ఆ అలలు తగ్గినప్పుడు అంతరంగ స్వరం వినిపిస్తుంది. నేటి మనిషి సమాచారంతో నిండిపోతున్నాడు. కానీ తన గురించి తాను తెలుసుకోవడానికి సమయం కేటాయించలేకపోతున్నాడు. ప్రతి క్షణం ఏదో ఒక శబ్దం అతణ్ని వెంటాడుతోంది. తన దృష్టిని బయటికి లాగుతోంది. ఫలితంగా ప్రపంచంతో అనుసంధానం పెరుగుతోంది. కానీ తనతో తనకు ఉండే అనుబంధం మాత్రం బలహీనమవుతోంది. ఒంటరిగా ఉన్నప్పుడు చాలామందికి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే, బయట శబ్దం ఆగినప్పుడు లోపలి ప్రశ్నలు వినిపించడం మొదలవుతుంది. మనం దాచిపెట్టిన భయాలు, తప్పులు, పశ్చాత్తాపాలు ముందుకు వస్తాయి. అలాగని వాటి నుంచి పారిపోవడం పరిష్కారం కాదు. వాటిని అర్థం చేసుకోవడమే ఎదుగుదల. ప్రకృతి మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. విత్తనం మొలకెత్తే శబ్దం వినిపించదు. పువ్వు చప్పుడు చేస్తూ వికసించదు. సూర్యోదయమూ నిశ్శబ్దంగా జరిగిపోతుంది. జీవితాన్ని నిలబెట్టే గొప్ప మార్పులన్నీ మౌనంగానే జరుగుతాయి. మనలో జరిగే పరివర్తన కూడా అంతే. చాలాసార్లు మనం సమస్యలకు వెంటనే సమాధానాలు కావాలనుకుంటాం. కానీ కొన్ని ప్రశ్నలకు జవాబులు ఆలోచనలతో రావు. అవి నిశ్శబ్దంలో మెల్లగా స్పష్టమవుతాయి. భావోద్వేగాలు తగ్గినప్పుడు వాస్తవం తెలుస్తుంది. అందుకే మహనీయులు ఆత్మపరిశీలనకు ప్రాధాన్యమిచ్చారు. రోజూ కొద్దిసేపైనా మనతో మనం గడపడం ఒక సాధన. అది ప్రపంచం నుంచి పారిపోవడం కాదు; జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, మనలోని బలాన్ని గుర్తించడం, బలహీనతలను అంగీకరించడం, అహంకారాన్ని తగ్గించుకోవడం, కృతజ్ఞతను పెంచుకోవడం. ఈ చిన్న అలవాట్లు క్రమంగా దృష్టిని మార్చుతాయి. జీవితం కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది. అప్పుడు విజయాలు వినయాన్ని నేర్పుతాయి. అపజయాలు పరిణతిని అందిస్తాయి. ఇతరులను మార్చాలని ప్రయత్నించే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలనే స్పృహ కలుగుతుంది. అదే అంతరంగ ప్రయాణం ఇచ్చే గొప్ప వరం. అదే మనిషిని మరింత ప్రశాంతంగా, జాగరూకంగా, కరుణతో నిండిన వ్యక్తిగా మారుస్తుంది.0,00%
  • 13 июн.సంతృప్తికర జీవనం నిజమైన సంపద అంటే ఏమిటి? మనం కష్టపడి సంపాదించిన ధనం, అధికారం, పేరు ప్రతిష్ఠలు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ, మనసు ప్రశాంతంగా, తృప్తిగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం సొంతమవుతుంది. బయటి ప్రపంచం మీద ఆధారపడకుండా, మన అంతరంగం నుంచి పుట్టే అనుభూతిని ఆత్మసంతృప్తి అంటాం. కొత్త వస్తువు కొన్నప్పుడు కలిగే ఉత్సాహం, విజయం సాధించినప్పుడు వచ్చే ఆనందం కాలక్రమేణా మసకబారతాయి. అయితే, మనకు దక్కిన వాటిని గుర్తించి, వాటి పట్ల కృతజ్ఞతతో ఉన్నప్పుడు కలిగే సంతోషం మాత్రం స్థిరంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాలు ఈ సత్యాన్ని అద్భుతంగా బోధించాయి. అశ్వమేధ యాగం తరవాత యుధిష్ఠిరుడు అపారమైన బహుమతులు పంచిపెట్టాడు. ఆ తరవాత ద్రౌపదిని ‘ఇంత గొప్ప యాగాన్ని నిర్వహించిన తరవాత నీకు ఏమనిపిస్తోంది?’ అని అడుగుతాడు. దానికి- దానం చేయడం గొప్పే కానీ నిజమైన తృప్తి హృదయంలో నుంచే పుడుతుందని బదులిస్తుంది ద్రౌపది. మనసు ఆనందంగా లేనివాడికి ఎన్ని సంపదలు ఉన్నా అవి నిరుపయోగం. సంతోషం సంపదలో కాదు, ఆత్మసంతృప్తిలోనే ఉంటుంది. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి, అనిశ్చితి మన జీవితాన్ని చుట్టుముడుతున్నాయి. ఇంకా ఇంకా కావాలనే ఎప్పటికీ తీరని ఆరాటం, ఎక్కడా ఆగని తపన మనల్ని సంతృప్తికి దూరం చేస్తున్నాయి. మన దగ్గర లేని వాటి గురించి చింతించడం మానేసి, ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోగలిగితేనే మనసుకు హాయిగా ఉంటుంది. కృతజ్ఞతతో జీవించడం ఆత్మసంతృప్తికి మొదటి అడుగు. అలాగే, ఇతరులకు చేసే చిన్న సాయం కూడా మనకు అసాధారణమైన ఆనందాన్ని ఇస్తుంది. స్వార్థం తగ్గి, పరోపకార గుణం పెరిగినప్పుడు మన మనసు తేలికగా, కాంతిమంతంగా అనిపిస్తుంది. విదురుడు చెప్పినట్లు, సంతృప్తే పరమానందం. అంటే- ధనం, పదవి, బంధువులు, భోగాలు ఇవన్నీ తాత్కాలికమే. నిరాపేక్షలోంచి పుట్టే సంతోషమే నిజమైనది. మనుస్మృతి కూడా ఈ భావాన్ని బలంగా చెబుతుంది. సంతోషమే పరమసుఖం, లోభమే పరమదుఃఖం... అని అప్రమత్తం చేస్తుంది. అందుకే లోభాన్ని దూరం పెట్టి, సంతోషాన్ని నిత్యం అనుభవంలోకి తెచ్చుకునేందుకు ఏం చేయాలో ఆలోచించాలి. ఆ సదాలోచనతో భక్తిమార్గంలో పయనించేవారికి స్వచ్ఛమైన ఆనందం కచ్చితంగా లభిస్తుంది. తైత్తిరీయ ఉపనిషత్తులోని మహావాక్యాల్లో ఒకటి ఆనందో బ్రహ్మ. బ్రహ్మ స్వరూపమే ఆనందం అని దీని భావం. అలాంటి బ్రహ్మానందం ఆత్మసంతృప్తి నుంచే లభిస్తుంది. దాని గురించి యోగ సూత్రాలు ఇలా అంటాయి: సంతోషాదనుత్తమః సుఖలాభః. అంటే, సంతృప్తి వల్ల అత్యుత్తమమైన సుఖం దక్కుతుంది. ఆత్మసంతృప్తి మనసుకు శాంతిని, జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. ఆశలు తగ్గించుకుంటే అశాంతికి తావులేదంటారు పెద్దలు. ఆశానిరాశల మధ్య ఊగిసలాడే మనసును స్థిరంగా నిలిపి, సంతృప్తిగా జీవించడం సాధన చేస్తే- అంతకు మించిన భాగ్యం మరేదీ ఉండదు. శ్రీధర్‌ కక్కెర0,00%
  • 20 маяఅన్నకు తగ్గ తమ్ముడు అన్నదమ్ముల అనుబంధానికి నిర్వచనం రామలక్ష్మణులు. రాముడితోడిదే లక్ష్మణుడి లోకం. అతడు పక్కన లేకపోతే మృష్టాన్న భోజనమైనా రాముడికి సహించేది కాదట. లక్ష్మణుడు తనకు కొడుకుతో సమానమని సీతమ్మతల్లి హనుమతో చెబుతుంది. యుద్ధభూమిలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు ఏ లోకంలో వెతికినా అతడిలాంటి తమ్ముడు దొరకడని శ్రీరాముడు వాపోతాడు. లక్ష్మణుడికి సైతం అన్నపట్ల అమితమైన ప్రేమ, భక్తి. ఆయనను ఒప్పించి వనవాసానికి వెంట వెళ్తాడు. పద్నాలుగేళ్లు అన్నావదినలకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తాడు. లక్ష్మణుడు తన బహిఃప్రాణమని శ్రీరాముడు అభివర్ణిస్తాడు. అన్న ఆజ్ఞతో శూర్పణఖ ముక్కూ చెవులు కోసి రావణసంహారానికి నాంది పలికినవాడు లక్ష్మణుడే. లోకనిందకు వగచిన శ్రీరాముడు సీతాదేవిని వాల్మీకి ఆశ్రమ పరిసర ప్రాంతంలో విడిచి రమ్మని లక్ష్మణుణ్నే ఆదేశిస్తాడు. అశ్వమేధయాగం చేసినపుడు యాగాశ్వరక్షణకు అతణ్నే పంపుతాడు. శ్రీరాముడు చేసే ముఖ్యమైన పనుల్లో లక్ష్మణుడి భాగస్వామ్యం ఉండి తీరుతుంది. రాముడు సీతా వియోగంతో దుఃఖిస్తున్నప్పుడు లక్ష్మణుడు ఓదారుస్తూ చెప్పిన మాటలను అందరూ గుర్తుంచుకోవాలి. ‘దుఃఖంతో ఉత్సాహం నశించిపోతుంది. ఉత్సాహం ఉంటే లోకంలో ఏదైనా సాధించవచ్చు. ఉత్సాహమే మనిషి బలం. అదే లేకపోతే మనిషి నిస్సహాయుడవుతాడు. స్మృతి పోతుంది. దుఃఖం, శోకం, భయం ప్రతిభను నశింపజేస్తాయి. వాటిని తొలగించుకుంటే లోకంలో దుర్లభమైనదేమీ ఉండదు…’ అంటాడు లక్ష్మణుడు. ధర్మానికి కట్టుబడిన రాముడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తమ్ముణ్నే విడిచిపెట్టాల్సి రావడం దైవసంకల్పం. శ్రీరామావతార పరిసమాప్తికి సమయం దగ్గర పడింది. ఒకరోజు యముడు ముని రూపంలో వచ్చాడు. రాముడితో తాను ఏకాంతంగా సంభాషించాలని, ఆ సమయంలో చూసినవారిని రాముడు సంహరించాలని షరతు విధిస్తాడు. అందుకు అంగీకరించిన శ్రీరామచంద్రుడు లక్ష్మణుణ్ని ద్వారం దగ్గర కాపలాగా ఉంచుతాడు. సరిగ్గా అదే సమయంలో దుర్వాస మహర్షి వచ్చి తనకు తక్షణం రామదర్శనం కావాలని, అలా కాకపోతే రాముడితోపాటు దేశానికీ కీడు వాటిల్లుతుందని అంటాడు. తనకు మరణం సంభవించినా అన్నగారికీ, దేశానికీ హాని జరగకూడదని భావించిన లక్ష్మణుడు దుర్వాస మహర్షి రాకను రాముడికి తెలియజేస్తాడు. నియమభంగం చేసిన తనను వధించమని అన్నను కోరతాడు. వశిష్ఠ మహర్షి సలహాతో రాముడు తమ్ముణ్ని విడిచిపెట్టేయాలని నిర్ణయించుకుంటాడు. లక్ష్మణుడు సరయు నదీతీరానికి వెళ్లి యోగశక్తితో శ్వాసను బంధించేస్తాడు. దేవేంద్రుడు శరీరంతోనే లక్ష్మణుణ్ని స్వర్గానికి తీసుకెళ్తాడు. కొన్ని సందర్భాలలో లక్ష్మణుడు ఆవేశంతో అనుచితంగా మాట్లాడినప్పుడు శ్రీరాముడు హిత వచనాలతో ధర్మాన్ని బోధించి తమ్ముణ్ని శాంతపరిచేవాడు. ఆస్తి కోసం అన్నదమ్ములు తగవులు పడే ఈ రోజుల్లో రామలక్ష్మణుల అనుబంధం ఆదర్శం, అనుసరణీయం. ధర్మబద్ధంగా ఆలోచించి తమ నడవడికను చక్కదిద్దుకున్నప్పుడు అన్నదమ్ముల మధ్య బంధం బలపడుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఆవేశాన్ని అదుపుచేసుకుని ఇచ్చి పుచ్చుకునే ధోరణి అవలంబించాలి. తోబుట్టువుల మధ్య ప్రేమాభిమానాలు వెల్లివిరిసే ఇళ్లే సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయి. ఇంద్రగంటి నరసింహ మూర్తి0,00%
  • 19 маяభక్తిమార్గం ముక్తిని పొంది భగవంతుడి చరణసన్నిధికి చేరడానికి భక్తి మార్గమే ముఖ్యమైనదీ సులభమైనదీ అన్నారు పెద్దలు. ఎందరో మహాత్ములు ఆ మార్గాన్ని అనుసరించి పరమాత్మలో ఐక్యమయ్యారు. భక్తికి ఉన్న శక్తి అపారం. నిస్వార్థంగా, నిశ్చలమైన భక్తితో భగవన్నామస్మరణ చేస్తే ముక్తి తప్పక లభిస్తుందని విశ్వాసం. మహాభారతాన్ని రచించిన తర్వాత వేదవ్యాసుడు విచారంగా ఉండటం గమనించిన నారదమహర్షి కారణమేంటని అడిగాడు. అప్పుడు వ్యాసుడు ‘మానవాళిని ఉద్ధరించడానికి వేదాలలో చెప్పిన ధర్మాలను మహాభారతంలో ఇమిడ్చి, వేదాధ్యయనం చేయలేనివారికి కూడా అర్థమయ్యేలా రాశాను. అయినా ఏదో తెలియని అశాంతి నన్ను వెన్నాడుతోంది. మనశ్శాంతి కలగాలంటే ఏం చేయాలో తెలుప’మని ప్రార్థించాడు. అప్పుడు నారదుడు ‘మహాభారతం ద్వారా నువ్వు మనిషి విధ్యుక్త ధర్మాలను, వాటిని నిర్వర్తించాల్సిన విధాలను తెలియజేశావు. భగవద్గీత ద్వారా ధర్మ, కర్మాల ప్రాధాన్యాన్ని వివరించావు. కానీ భగవంతుడి పట్ల ఉండాల్సిన అనన్యమైన భక్తి గురించి పూర్తిగా తెలుపలేదు, శ్రీమన్నారాయణుడి సంకీర్తన మాహాత్మ్యాన్ని వివరించలేదు. ముక్తిని పొందడానికి, భగవంతుణ్ని చేరడానికి ధర్మాచరణతో పాటుగా భక్తి మార్గాన్ని అనుసరించాలి. కాబట్టి నారాయణుణ్ని కీర్తిస్తూ గానం చెయ్యి...’ అని వివరించాడు. నారదమహర్షి ఉపదేశాన్ని అనుసరించి వ్యాసుడు భాగవతం రచన చేసి మానవాళికి కానుకగా అందించి, మనశ్శాంతిని పొందాడు. మార్కండేయుడు తనకి పదహారో ఏట మృత్యువు ఉందని తెలుసుకుని, ఘోరతపస్సు చేసి శివుణ్ని ప్రసన్నం చేసుకున్నాడు. ప్రాణాలు హరించడానికి వచ్చిన యముడినుంచి కాపాడమంటూ శివలింగాన్ని కౌగలించుకున్నాడు. అతడి అచంచల భక్తికి మెచ్చిన శివుడు, యమపాశం నుంచి రక్షించి చిరంజీవిగా వరమిచ్చాడు. ఇంకా ధృవుడు, కన్నప్ప, సక్కుబాయి... ఇలా ఎందరో భక్తితో సేవించి, భగవంతుడి పాదపద్మాలను చేరుకున్నారు. నిత్యకర్మలలో ఎంతగా తలమునకలై ఉన్నప్పటికీ, కొంత సమయం భగవన్నామస్మరణకు వెచ్చిస్తేనే మనసుకు శాంతి... జీవితానికి ముక్తి! దినవహి సత్యవతి0,00%
  • 17 маяహద్దే ముద్దు స్వేచ్ఛ జీవితానికి సార్థకతను చేకూరుస్తుందని చాలామంది అభిప్రాయం. కానీ అసలైన సార్థకత హద్దులు ఎరిగి ప్రవర్తించడమే. నది హద్దులో ఉంటేనే పల్లెలు పచ్చగా ఉంటాయి. అది గట్టుదాటితే వరదవుతుంది. భావాలకూ, భావ ప్రకటనకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. కొందరు హుందాగా మితంగా మాట్లాడుతూ బోలెడంత ఆత్మీయతను మూటగట్టుకోగలుగుతారు. ఇంకొందరు ఎంతో చెప్పాలని ఆరాటపడుతూ హద్దులు దాటి ప్రవర్తించి తమ విలువను తగ్గించుకుంటారు. అనురాగానికి మర్యాద అనే అలంకారాన్ని జోడిస్తే కనిపించే అందం అనంతమైన ఆనందాన్ని అందిస్తుంది. అందుకే మన పూర్వీకులు పలకరింపులో కూడా వినయాన్ని జోడించారు. చేతులు జోడించి నమస్కరించడం సంప్రదాయమే కాదు, ఎదుటివారిపట్ల ఉన్న ప్రేమైక భావనను వ్యక్తీకరించడం కూడా. మాతృదేవోభవ, పితృదేవోభవ… అంటూ బంధాలనే భవంతులను ఉన్నతంగా చూపించాయి ఉపనిషత్తులు. వీటిని సమున్నతంగా ఎంచినవాడు, జీవితంలో మిగతా బంధాలనూ గౌరవించే స్థితికి ఎదిగితీరతాడు. సంబంధబాంధవ్యాల్లో గౌరవం ఉంటేనే అనురాగం పవిత్రమవుతుంది. ప్రేమ బహిరంగ ప్రదర్శనగా మారితే కలిగే అసౌకర్యం వర్ణనాతీతం. కానీ, ఈరోజుల్లో ప్రేమను బయటికి ప్రకటించకపోతే దాని విలువ తగ్గిపోతుందన్న భ్రమలు పెరిగిపోతున్నాయి. నిజానికి మన సంస్కృతి మనకు చెప్పిన రీతి, రివాజులు వేరు. శ్రీరాముడికీ సీతాదేవికీ మధ్య ప్రేమ అపారమైనది. కానీ అది ఎప్పుడూ ప్రదర్శన కాలేదు. పరస్పర గౌరవంగానే కడవరకూ నిలిచింది. ప్రపంచంలో ప్రతి దేశానికీ తనదైన సంస్కృతి ఉంటుంది. అవన్నీ ప్రత్యేకమైనవే అయినప్పటికీ భారతీయ సంస్కృతి మనకు సంయమనం అనే గొప్ప గుణాన్ని నేర్పింది. ప్రేమంటే స్పర్శ మాత్రమే కాదనీ, గౌరవంతో కూడిన బాధ్యత వల్ల ఏర్పడే పరిమితి అని స్పష్టంగా వివరించింది. తల్లి బిడ్డను తాకే స్పర్శ భద్రత. గురువు శిష్యుడి తలపై చేయి ఉంచితే ఆశీర్వాదం. దాంపత్యంలో ఉన్న మమకారం కుటుంబానికి ఆధారం. ఇవన్నీ పవిత్రంగా కనిపించడానికి కారణం వాటిలోని మర్యాద. పిల్లలు పెద్దల మాటలకన్నా ప్రవర్తనను ఎక్కువగా గమనిస్తారు. అందుకే పెద్దలు మాటల్లోనూ, చేతల్లోనూ హద్దుల్లో ఉండాలి. ఆచరణాత్మకంగా పిల్లలకు విలువలను బోధించాలి తప్ప వలువల దొంతరల్లా వాటిని వాళ్లకు బలవంతంగా చుట్టబెట్టే ప్రయత్నం చేయకూడదు. అప్పుడే కొత్త తరం సంస్కారాన్ని సహజంగా అర్థం చేసుకుంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు సద్గుణాలను వివరించే సందర్భంలో- మానసిక నియంత్రణ, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, శుభ్రత, క్షమ, నిజాయతీ, జ్ఞానం, వివేకం, దైవం పట్ల విశ్వాసం ఇవన్నీ ఉన్నతమైన స్వభావం గల వ్యక్తి సహజ గుణాలని చెప్పాడు. వేదం ‘సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు’ అన్న చిన్నమాటతో గొప్ప జీవన మార్గాన్ని తెలిపింది. దాన్ని నవతరానికి అలవరచాలి. ప్రేమైనా, ప్రేమ నిండిన జీవితమైనా హద్దుల్లో ఉంటేనే మధురమనే విషయాన్ని వారి మనసుకు హత్తుకునేలా వివరించాలి. మల్లాది వేంకట గోపాలకృష్ణ0,00%
  • 12 маяజ్ఞాననిధి హనుమ కార్యసాధకుడికి పట్టుదల ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి ఓర్పు, నేర్పు సమపాళ్లలో జతకలవాలి. సహనం ఎంత ముఖ్యమో సమయస్ఫూర్తి కూడా అంతే అవసరమన్నది గ్రహించాలి. హనుమంతుడిలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. సీతాన్వేషణకు ముందు రాముడు ఆంజనేయుడిలో గమనించిన విషయం కూడా ఇదే. శాస్త్రరీత్యా హనుమ శబ్దానికి వాక్యకోవిదుడు, జ్ఞాని అనే విశేషార్థాలు ఉన్నాయి. హనుమ ఓ జ్ఞాననిధి. ఆయన వ్యక్తిత్వం సామాన్యమైనది కాదు. వివేకం, ప్రతిభ, సమయస్ఫూర్తి, సంయమనం మొదలైనవి హనుమలో పరిపూర్ణంగా ఉన్నాయి. అయితే జ్ఞానం కలిగి ఉంటే సరిపోదు. దాన్ని తగినవిధంగా సమయానికి వినియోగించడమన్నది ముఖ్యం. బుద్ధిబలాన్ని ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ పరాక్రమం ప్రదర్శించాలో, ఆలోచించి ఎక్కడ అడుగు ముందుకు వేయాలో హనుమకు బాగా తెలుసు. ఆయన మాటతీరు సుస్పష్టం. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు వీనుల విందుగా మాట్లాడేవాడు. ఇంకా ఇంకా వినాలనిపించేలా ఉండేదట ఆ మాట. అతిగానో, మరీ క్లుప్తంగానో చెప్పకుండా విషయం అర్థమయ్యేలా వివరించడం ఆయనలోని ప్రత్యేకత. వినయశీలురే విజయానికి చిరునామాగా నిలుస్తారు. హనుమలో ఈ గుణం పరిపూర్ణంగా ఉంది. అడవిలో కాషాయాంబరధారులై వస్తున్న రామలక్ష్మణులను చూసి శత్రువులుగా భావించాడు సుగ్రీవుడు. హనుమంతుడు ధైర్యంగా వారికి ఎదురెళ్లి కలిసి మాట్లాడి వెంట పెట్టుకునివచ్చి సుగ్రీవుడితో స్నేహం కలిపించాడు. ఎదుటివారికి ఒక విషయం చెప్పేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే చెబుతాడు హనుమ. మాటలు అసందర్భంగా దొర్లనివ్వడు. ప్రధానంగా ఇది గమనించే శ్రీరామచంద్రుడు ఆయనను దూతగా నిర్ణయించుకున్నాడు. రాజహృదయం, ధర్మనీతి, కార్యసిద్ధి మెదలైనవి దృష్టిలో పెట్టుకోగలిగిన మేధావి మాత్రమే దూత కాగలడు. అశోకవనంలో సీతమ్మను గుర్తించి, ఆమెకు రాముడి ప్రేమను ప్రకటించి ఓదార్చాడు. రావణుడి సమక్షంలో శ్రీరాముడి వీరత్వాన్ని విడమరిచి చెప్పి అతడి గుండెల్లో ప్రకంపనలు సృష్టించి అధైర్యపరచాడు. పాలకుడు అధర్మపరుడైతే అతడికి, అతడి రాజ్యానికి అరిష్టం. స్త్రీని శోకింపచేస్తే మహాజ్వాలగా లేచి భస్మం చేస్తుంది. పర స్త్రీని చెరపట్టినవాడు ఎంతటి పరాక్రమవంతుడైనా పతనం తప్పదు. ఎంతటి భక్తిపరుడైనా దైవం సహకరించదు- అంటూ నర్మగర్భంగా హెచ్చరించాడు. సీతమ్మ తల్లితో ‘అమ్మా! వానరసేనలో నాకంటే అధికులు, నాతో సమానమైనవారు చాలామంది ఉన్నారు. నాకంటే అల్పుడు ఒక్కడు కూడా లేడు’ అంటూ తనను తాను తగ్గించుకుని సీతమ్మకు ధైర్యం చెప్పాడు. ఏ కార్యమైనా సాధించగలననే ధైర్యం హనుమలో అణువణువునా నిండి ఉంది. నిజంగానే అంతటి సమర్థుడు కూడా. ‘హనుమంతుడు ఉంటే అందరూ బతికి ఉన్నట్టే. ఆయనలేకుంటే ఎవరూ లేనట్టేనని’ ఓ సందర్భంగా జాంబవంతుడన్న మాటల్లో ఎంతో పరమార్థం ఉంది. శ్రీరామకార్యాన్ని అంకిత భావంతో సాధించి శ్రీమద్రామాయణ కావ్యంలోని సుందరకాండలో దేదీప్యంగా వెలుగుతున్నాడు హనుమంతుడు. జ్ఞాననిధి హనుమ నిత్యపూజనీయుడు.0,00%
  • 26 февр.అసలైన పూజ ఏది? మ నిషి భగవంతుడికి దగ్గరవడానికి ఎంచుకునే మార్గమే పూజ. మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెనలాంటిది అది. అలాగని దేవుడి పటాలకు పూలు పెట్టి, ధూపదీపాలు సమర్పించినంత మాత్రాన అది పూజ అయిపోదు. పునాది లేని భవనం ఎలా కూలిపోతుందో.. భక్తి, ధర్మం లేని పూజ కూడా అలాగే నిష్ఫలమవుతుంది. పెద్దలు అన్నట్లు ‘భావం లేని పూజ- పత్రికి చేటు’. భగవంతుడు బాహ్య ఆడంబరాలకు కాదు, హృదయంలోని భావానికి మాత్రమే వశుడవుతాడు. శాస్త్రం ‘భావగ్రాహీ జనార్దనః’ అని చెబుతుంది. మనసులో కల్మషం పెట్టుకుని చేసే పూజ ఎంత గొప్పదైనా అది దేవుడికి చేరదు. మనసు భగవంతుడిపై కాకుండా ప్రాపంచిక విషయాలపై ఉంటే, ఆ పూజ అర్థహీనమవుతుంది. భగవద్గీత ప్రకారం ‘ఈశ్వరః సర్వభూతానాం’ అంటే- భగవంతుడు మన హృదయంలోనే నివసిస్తాడు. ‘నేను గొప్పగా పూజిస్తున్నాను’ అనే అహంకారంతో ఆర్భాటంగా చేసే పూజ రాజస గుణంతో నిండిపోతుంది. దక్ష ప్రజాపతి శివుణ్ని అవమానించాలనే ఉద్దేశంతో చేసిన మహాయజ్ఞం ఫలితం లేకుండా ధ్వంసమైంది. అలాగే రావణుడు గొప్ప భక్తుడైనా, అహంకారం వల్ల తపో ఫలాలను కోల్పోయాడు. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో దేవుడికి బంగారు ఆభరణాలు అర్పించినంత మాత్రాన పుణ్యం రాదు. దుర్యోధనుడు శ్రీకృష్ణుడి కోసం వైభవంగా విందులు ఏర్పాటు చేశాడు. అవి అహంకారం, అన్యాయంతో కూడినవి కావడంతో కృష్ణుడు వాటిని తిరస్కరించాడు. బదులుగా, విదురుడు ప్రేమతో పెట్టిన సాధారణ భోజనాన్ని స్వీకరించాడు. ఇది భక్తి ముందు ఆడంబరం విలువలేనిదని స్పష్టం చేస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులను బాధపెడుతూ, బయట ఆలయాలకు వెళ్లి అర్చనలు చేస్తే పుణ్యం రాదు. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అనేది మన సంస్కృతికి మూలసూత్రం. పుండరీకుడు తల్లిదండ్రులను సేవిస్తున్నప్పుడు స్వయంగా పాండురంగడు దర్శనమిచ్చినా, సేవ పూర్తయ్యేవరకు దేవుణ్నే వేచి ఉండమన్నాడు. తల్లిదండ్రుల సేవనే అసలైన పూజగా భావించాడు. పైకి మంత్రాలు జపిస్తూ, లోపల ప్రాపంచిక విషయాలు ఆలోచించడమూ నిజమైన పూజ కాదు. చేత్తో దేవుడి ముందు దీపం వెలిగిస్తూ నోటితో పరులమీద నిందారోపణలు చేస్తుంటే... ఆ పూజ కేవలం శారీరక చర్యగా మిగులుతుంది. మనస్ఫూర్తిగా సమర్పించే చిన్న పువ్వు, యాంత్రికంగా చేసే వెయ్యి పూజలకన్నా గొప్పది. ఇక ఇతరులకు హాని చేయాలనే ఉద్దేశంతో చేసే పూజలు చివరికి నాశనానికే దారితీస్తాయి. భస్మాసురుడు ఘోర తపస్సు చేసినా, దురుద్దేశం వల్ల పొందిన వరమే అతడి మరణానికి కారణమైంది. శబరి ఎంగిలి పండ్లు, కన్నప్ప కంటి అర్పణ శాస్త్రోక్తంగా చేయకపోయినా, వారి నిష్కల్మషమైన భక్తి వల్ల అవి అత్యున్నత పూజలయ్యాయి. ఆడంబరాల జోలికి వెళ్లకుండా మనసును నిర్మలంగా ఉంచుకుని, తోటి జీవుల పట్ల కరుణతో, ధర్మబద్ధంగా జీవించడమే భగవంతుడికి మనం చేసే అసలైన పూజ. కె. నారాయణ స్వామి పిళ్లై0,00%
  • 6 февр.పంచ సూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి. ఆ దిగ్గజాల పేర్లు విరూపాక్షుడు, భద్రుడు, మహాకాలుడు, మహాపద్ముడు. ఈ పేర్లలో దాగి ఉన్న నాలుగు శక్తులు - జ్ఞానం, ధర్మం, కాలజ్ఞానం, శాంతి. ఈ నాలుగింటిని ఒక్కటిగా ముడిపెట్టే అయిదో శక్తే... భక్తి. తూర్పుదిక్కున విరూపాక్షుడు రూపాలకు అతీతమైన దృష్టికి ప్రతీక. జ్ఞానమంటే కేవలం చదవడం కాదు, అవగాహన. నిజాన్ని చూడాలంటే చైతన్యం ముఖ్యమని విరూపాక్ష దృష్టి చెబుతుంది. మనిషిలో అవగాహన ఉన్నప్పుడే సత్యం కనిపిస్తుంది. జ్ఞానం మనసుకు సరైన దిశనిచ్చే దివిటీ. అదే భూమిని స్థిరంగా ఉంచే మొదటి బలం. ఉత్తరాన్ని భద్రుడు పాలిస్తాడు. ఆయన పేరు శుభాన్ని సూచిస్తుంది. ధర్మమే నిజమైన భద్రత; ఆత్మనిబద్ధతే అంతిమ రక్షణ. ధర్మాన్ని కాపాడినవాడే సురక్షితంగా ఉంటాడు. ధర్మం ఆత్మ తాలూకు కర్తవ్యబోధ. ధర్మం ఉన్నచోట న్యాయం వెల్లివిరుస్తుంది. మహాభారతంలో యుధిష్ఠిరుడు ధర్మరాజుగా, ధర్మమే సమాజ స్థిరత్వానికి మూలమని నిరూపించాడు. వేదాలు సైతం ప్రజలు ధర్మం నుంచే ఉద్భవిస్తారని చెబుతాయి. పశ్చిమ దిక్కున మోసే మహాకాలుడు కాలస్వరూపుడు. కాలం మనకు అవగాహన కలిగించే గురువు. సమయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు భాగ్యవంతుడవుతాడు. సమయాన్ని వ్యర్థం చేసినవాడు జీవితాన్ని వృథా చేసుకుంటాడు. కాలజ్ఞానం ఉన్నవాడు సృష్టిలో స్థిరంగా నిలబడతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కాలాన్ని తన స్వరూపంగా చెప్పాడు. ఇక, దక్షిణ దిక్కున మహాపద్ముడు శాంతి, కరుణ, నిర్మలత్వానికి చిహ్నం. పద్మం మలినజలంలో పుట్టినా స్వచ్ఛంగా ఉంటుంది. అదే జీవన తత్త్వం. పరిస్థితులు ఎలాంటివైనా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. శాంతి అంటే సమత్వం. శాంతి మనసుకు లభించే అంతరానందం. శాంతి ఉన్న చోటే దైవం ఉంటాడు. మహాపద్ముడు మనకు క్షమ, ప్రేమ, సహనం, తపస్సు నేర్పుతాడు. భక్తి అంటే దైవంపై నమ్మకమే కాదు, మనలోని దివ్యత్వంపై విశ్వాసం. సమర్పణతో కూడిన భక్తి అంటే భగవంతుడిలో విలీనం కావాలనే తపన కలిగి ఉండటం. భక్తి లేకుంటే జ్ఞానదీపం వెలగదు, ధర్మం నిలవదు, శాంతి దొరకదని భగవద్గీత చెబుతోంది. భక్తి విశ్వానికి హృదయ స్పందన. దాన్ని వినగలిగితే దైవాన్ని దర్శించడం కష్టం కాదు. ఈ పంచతత్త్వాలు మనలో మేల్కొన్నప్పుడే... జ్ఞానంతో వివేచన, ధర్మంతో న్యాయం, కాలజ్ఞానంతో సమయోచిత నిర్ణయాలు, శాంతితో సహనం, భక్తితో ఐక్యత అలవడతాయి. భూమి నిలబడేది గజాలపై కాదు, విలువలపై. మానవత్వం నిలబడేది జ్ఞానం, ధర్మం, కాలజ్ఞానం, శాంతి, భక్తి అనే పంచసూత్రాలపై! శ్రీధర్‌ కక్కెర్ల0,00%
  • 7 янв.మహాభక్తులు శ్రీవైష్ణవ సంప్రదాయంలో 12 మంది ఆళ్వారులు ఉంటారు. ఆళ్వారులంటే లోతులను చూసినవారని ఒక భావన. కాపాడేవాడనీ, పరిపాలకుడనీ, భగవంతుడనీ భిన్నార్థాలున్నాయి. శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మమని, పరంధాముడని ప్రకటించిన మహా భక్తులు ఆళ్వారులు. వీరు తమిళంలో రచించిన స్తోత్రాలను పాశురాలంటారు. నాలుగువేల పాశురాలు గల ‘వాలాయిరమ్‌’ అనే దివ్య ప్రబంధాన్ని ద్రావిడ వేదమన్నారు. భిన్న సామాజిక నేపథ్యం కలిగిన ఆళ్వారుల్లో మొదటి ముగ్గురిని మొదలాళ్వారులంటారు. ఈ ముగ్గురు పాయ్‌గై, పూదత్త, పేయాళ్వారులు. శ్రీమన్నారాయణుడి శంఖమైన పాంచజన్యం, గద కౌమోదకి, ఖడ్గం నందకం... అంశలతో జన్మించిన ఈ ముగ్గురూ విశ్వక్సేనుల నుంచి మంత్రోపదేశం పొంది దేశసంచారం చేశారన్నది భక్తుల విశ్వాసం. తిరుమళిశైయాళ్వార్‌సుదర్శన చక్రం అంశగా చెబుతారు. మేదరి ఇంట పెరిగిన ఆయన బుట్టలు, చేటలు అల్లి అమ్ముతుండేవారు. వైష్ణవ సిద్ధాంతంలో ప్రముఖుడైన నమ్మాళ్వార్‌చింతచెట్టు తొర్రలో నివసించేవారని, 108 దివ్యదేశాల్లోని స్వాములనూ కీర్తించారని సంప్రదాయం చెబుతోంది. నమ్మాళ్వారు ఆత్మవంటివాడని మిగిలిన పదకొండుమందీ అవయవాలని భావిస్తారు. నమ్మాళ్వారు తన 35వ ఏట ముక్కోటి ఏకాదశినాడు పరమపదించారు. ఆయన శిష్యుడు మధురకవి ఆళ్వారు నమ్మాళ్వారు ప్రవచించిన దివ్య ప్రబంధాలను ప్రచారం చేశాడు. వేదాలు, కావ్యాలు అధ్యయనం చేసి మధురకవిగా విఖ్యాతుడైన ఆయన శ్రీమన్నారాయణుడి గణాల్లో ప్రముఖుడైన కుముదుడి అంశతో జన్మించినట్టు భక్తుల విశ్వాసం. విల్లిపుత్తూరుకు చెందిన విష్ణుచిత్తుడే ఏడో వారైన పెరియాళ్వారు. గరుత్మంతుడి అంశగా భావించే ఆయన నిత్యం స్వామికి తులసిమాలలూ, రంగురంగుల పూదండలూ సమర్పించేవాడు. మధుర పాలకుడైన వల్లభదేవుడు మోక్షసాధనకు సులభమైన మార్గం తెలుసుకోవాలని అన్ని దేశాల విద్వాంసులనూ ఆహ్వానించాడు. కొంత ధనాన్ని మూట కట్టి స్తంభానికి వేలాడగట్టించి ఎవరి వాదన అనంతరం ఆ మూట కింద పడుతుందో అదే సరైన ధర్మమని నమ్ముతానని ప్రకటించాడు. వటపత్రశాయి కృపవల్ల విష్ణుచిత్తుడు విజేతగా నిలిచాడు. మహానందంతో 12 పాశురాలు గానం చేశాడు. కేరళలో ధృడవ్రతుడనే రాజదంపతులకు పుట్టిన కులశేఖరాళ్వారు రాజ్యాన్ని పాలించాడు. భక్తిరసమయంగా ముకుందమాల రచించాడు. విష్ణుచిత్తుడి పెంపుడు కూతురు ఆండాళ్‌గోదాదేవిగా ప్రసిద్ధం. తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని లోకానికి ఉపదేశించారు. తిరుమంగై ఆళ్వారు హరి చేతిలోని ధనుస్సు అంశగా ప్రసిద్ధి. శ్రీరంగనాథుడే ఆయనకు అష్టాక్షరి ఉపదేశించాడట. విప్రనారాయణుడే తొందరప్పొడి ఆళ్వారు. దేవదేవి అనే వేశ్యకు వశుడై చివరకు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాడు. నారాయణుడి గుండెపై ఉండే శ్రీవత్సమనే పుట్టుమచ్చ అంశ అంటారు. లోకసారంగముని, తిరుప్పాణను భుజాలపై మోసుకుని రంగనాథుడి సన్నిధికి తీసుకుపోయినట్టు ఒక ఉదంతం బహుళ ప్రచారంలో ఉంది. ఈ ఆళ్వారును మునివాహనుడంటారు. మొదటి ముగ్గురు తప్ప మిగిలిన ఎనిమిది మంది క్రీ.శ 6- 10 శతాబ్దాల మధ్య జీవించినట్టు ఆధునిక చరిత్రకారులు పేర్కొంటున్నారు. డాక్టర్‌దామెర వేంకట సూర్యారావు0,00%
  • 26 дек.కృతజ్ఞత... యోగమార్గం మనిషి జీవితంలో భావోద్వేగాలకు కీలకమైన స్థానం ఉంది. వాటిలో కృతజ్ఞత అనేది అత్యంత పవిత్రమైన భావన. కృతజ్ఞతలు... హృదయపూర్వకంగా చెప్పే ధన్యవాదాలు. మనకు ఉపకారం చేసినవారికి మనసారా ధన్యవాదాలు చెప్పడమే కాకుండా, వారు చేసిన మేలును గుర్తుంచుకుని జీవితంలో ప్రతిఫలించడం. అదే అసలైన కృతజ్ఞతా రూపం. మానవసంబంధాలు, పరస్పర గౌరవం, దయా మమతలు అన్నీ దాని ద్వారా స్థిరపడతాయి. విద్యార్థులు గురువుల పట్ల, పిల్లలు తల్లిదండ్రుల పట్ల, భక్తులు భగవంతుడి పట్ల చూపే కృతజ్ఞత భావన వల్ల జీవితం ధర్మమార్గంలో నడుస్తుంది. ధన్యవాదమనేది ఒక ఆధ్యాత్మిక సాధనం. ఇది మనిషిని సానుకూల దృక్పథంతో నింపుతుంది. సంతోషం, శాంతి, దైవసాన్నిధ్యాల వైపు నడిపిస్తుంది. దానివల్ల అసంతృప్తి, అసూయ వంటి ప్రతికూల భావనలు తొలగిపోతాయి. పురాణ ఇతిహాసాల్లో కృతజ్ఞతను ఒక ధర్మంగా, జీవనవిలువగా వర్ణించారు. ఇది మనిషి హృదయాన్ని స్వచ్ఛంచేసి, సంబంధాలను మెరుగు పరుస్తుంది. కృతజ్ఞత లేని జీవితం అసంపూర్ణం. కృతజ్ఞత ఆత్మను పరమాత్మతో జోడిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం, కర్మ, సమర్పణ గురించి బోధిస్తూ దైవంపట్ల, సమాజంపట్ల కృతజ్ఞత ఉండాలని సూచిస్తాడు. చేసిన మేలును గుర్తుంచుకోవడం మనిషిని వినమ్రతతో నడిపిస్తుంది. ఆధ్యాత్మిక దృక్కోణంలో కృతజ్ఞత ఒక రకమైన ధ్యానంలా పనిచేసి ఎదుగుదలకు పునాది వేస్తుంది. మనసును శాంతిమయం చేస్తుంది. చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞత చూపడం అలవరచుకుంటే ఆ ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు. రాముడు హనుమంతుణ్ని ఆత్మీయుడిగా, స్నేహితుడిగా గౌరవించాడు. దానికి ప్రతిగా హనుమంతుడు శ్రీరాముడి పట్ల అపారమైన కృతజ్ఞతను, భక్తిని చూపించాడు. సీతమ్మని వెతకడం, లంకను దహించడం, రాముడి కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడటం వంటివి హనుమంతుడి కృతజ్ఞతకు నిదర్శనాలు. కృష్ణార్జునుల అనుబంధం, కృష్ణ సుధాముల మైత్రి కథలూ ఇందుకు పేరొందినవే. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి అతణ్ని ధర్మమార్గంలో నడిపించాడు. దానికి ప్రతిగా అర్జునుడు కృష్ణుణ్ని గురువుగా, స్నేహితుడిగా గౌరవించాడు. సుధాముడు బీదవాడైనప్పటికీ కృష్ణుడితో ఉన్న స్నేహబాంధ]వ్యాన్ని గౌరవిస్తూ కానుకగా అటుకులు తీసుకెళ్లాడు. కృష్ణుడు ఆ అటుకులను అత్యంత ప్రేమతో స్వీకరించి సుధాముడికి అపారమైన సంపదను ప్రసాదించాడు. ఈ కథలు కృతజ్ఞత శక్తిని, అది ఎలా దైవానుగ్రహాన్ని తెస్తుందో చూపిస్తాయి. కృతజ్ఞత ఒక యోగమార్గం. మనసును అహంకారం నుంచి విముక్తంచేసి, దైవంతో ఐక్యం కావడానికి సాయపడుతుంది. ప్రతి వ్యక్తీ తన కర్తవ్యాలను నిస్వార్థంగా నిర్వహించి ఫలితాల పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపడం ఒక ఆధ్యాత్మిక సాధనంగా పురాణాలలో పేర్కొన్నారు. అది మనిషిని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, సందిగ్ధం నుంచి స్పష్టత వైపు నడిపిస్తుంది. కాబట్టి, కృతజ్ఞతను జీవన విధానంగా మార్చుకోవడం ద్వారా శాంతి, సంతృప్తి, దైవ సాన్నిధ్యాలను పొందవచ్చు. తల్లాప్రగడ గోపాలకృష్ణ0,00%